బైక్ ఆపాడని పోలీస్ పైనే పిడి గుద్దులు!

traffice police attack

మనం ఏదో పని మీదపోతుంటాము. ట్రాఫిక్ పోలీస్ వచ్చి బండి ఆపుతాడు. లైసెన్స్ అడుగుతాడు. ఆర్.సి అడుగుతాడు. పొల్యూషన్ చెక్ ఎక్కడ అంటాడు. మన దగ్గర అన్నీ సక్రమంగా ఉంటే..తన దారిన తాను పోతాడు. దీన్ని మన సైడ్ నుండి ఆలోచిస్తే టైమ్ వేస్ట్ చేసినట్టే అనిపిస్తుంది. కానీ.., అది వాళ్ళ విధి. వాళ్లే లేకుంటే బండి నడపడం కూడా సరిగ్గా రాని వాళ్ళు నేరుగా రోడ్ల మీదకి వచ్చి యాక్సిడెంట్స్ చేసేస్తారు. హెల్మెంట్స్ వాడకుండా జనం ప్రాణాలు పోగొట్టుకుంటారు. ట్రాఫిక్ పోలీస్ లు ఉదయం నుండి రాత్రి వరకు ఆ పొల్యూషన్ లో నిలబడి డ్యూటీ చేసేది మన రక్షణ కోసమే. అలాంటి పోలీస్ లను గౌరవించడం మన బాధ్యత. కానీ.., కొంతమంది మాత్రం విచక్షణ కోల్పోయి పోలీస్ ల మీదే రౌడీయిజం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే విజయవాడలో జరిగింది.

man attacks on traffic policeనిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన ఘటన డాబాకొట్ల సెంటర్‌ ప్రధాన కూడలిలో గురువారం సాయంత్రం జరిగింది. మూడో పట్టణ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ శేఖర్‌బాబు గురువారం సాయంత్రం డాబా కొట్ల సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తుండగా సింగ్‌నగర్‌ లూనా సెంటర్‌ ప్రాంతానికి చెందిన కొప్పుల నాగరాజు, మరో ఇద్దరు బైక్‌పై అటు వైపుగా వచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ సత్యనారాయణ ఆదేశాల మేరకు కానిస్టేబుల్‌ శేఖర్‌ వారిని ఆపారు. దీంతో నాగరాజు ఒక్కసారిగా కానిస్టేబుల్‌ తో వాగ్వాదానికి దిగాడు. నా బండినే ఆపుతావా? ఎంత దైర్యం అంటూ రెచ్చిపోయాడు. అదే ఊపులో కానిస్టేబుల్‌ శేఖర్‌ పై పిడిగుద్దులు కురిపించాడు. ఫలితంగా శేఖర్‌ గాయపడ్డాడు.అనంతరం ముగ్గురూ బైక్‌పై పరారయ్యేందుకు యత్నిస్తుండగా పోలీసులు నాగరాజును పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో నాగరాజు ఎస్‌ఐతోనూ వాగ్వాదానికి దిగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నాగరాజుతో పాటు వచ్చిన మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకునే పనిలో పడ్డారు.