కరోనా బ్రీత్ అనలైజర్ వచ్చేస్తోంది.. జస్ట్ గాలి ఊదితే చాలు

స్పెషల్ డెస్క్- కరోనా ప్రపంచాన్ని గడ గడ వణికిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తూ.. మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఏమాత్రం లక్షణాలు కనిపోయించినా వెంటనే పరీక్ష చేసుకోవాల్సి వస్తోంది. లేదంటే మనకు కరోనా వచ్చిందా అన్న అనుమానం పట్టి పీడిస్తుంది. ఇక కరోనా పరీక్షలు చేయించుకోవాలంటే అదో తతంగం. టెస్ట్ కోసం స్వాబ్ షాంపుల్ ఇవ్వాలి, రిజల్ట్ కోసం కనీసం 12 గంటలు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మనకు కరోనా పాజిటివ్ వస్తుందా.. లేక నెగెటివ్ వస్తుందా అని మనసు తొలిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శాస్త్రవేత్తలు కరోనా పరీక్షల్లో కొత్త విధానాన్ని కనిపెట్టారు.

Breathalyser

కేవలం శ్వాస ద్వారా కరోనా సోకిందో లేదో చెప్పేసే కొత్త సిస్టం ను అందుబాటులోకి తెచ్చారు నిపుణులు. అయితే ఇది మన భారత్ లో మాత్రం కాదు. ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే ఇజ్రాయెల్ ఈ టెక్నాలజీని కనిపెట్టింది. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్తరకం బ్రీతింగ్ అనలైజర్ తో కరోనా పరీక్షను క్షణాల్లో చేసేయెచ్చు. అది కూడా చాలా ఖచ్చితమైన ఫలితం వస్తుందట.ఈ మెషిన్ కోసం తయారు చేసిన ప్రత్యేకమైన మైక్రో కాపర్ చిప్ పై నోటితో గాలిని ఉదాలి. అంటే మన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం బ్రీత్ అనలైజర్ కు ఎలాగైతే గాలిని ఉదుతామో.. అలాగే ఈ చిప్ పై నోటితో గాలిని ఉదాలి. ఆ తరువాత ఆ చిప్ ను కరోనా అనలైజింగ్ మెషిన్ లో పెట్టాలి.

అంతే క్షణాల్లో మనకు కరోనా పాజిటివా, లేక నెగిటివా అని చెప్పేస్తుంది. ఇలా రోజుకు ఎంత మందికైనా కరోనా పరీక్షలు చేయవచ్చట. ప్రయోగాత్మకంగా చేసిన పరీక్షలన్నీ సక్సెస్ అయ్యాయని ఇజ్రాయెల్ చెబుతోంది. దీనిలో మరి కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారట. ఈ కరోనా బ్రీత్ అనలైజర్ టెక్నాలజీపై మన దేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. అదే గనుక జరిగితే త్వరలోనే మన దగ్గరకు కూడా కరోనా బ్రీత్ అనలైజర్స్ వచ్చేస్తాయన్నమాట.