ధాన్యం కొనుగోలుపై కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్- తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుపై గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ పై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో యుధ్దం ప్రకటించారు. హైదరాబాద్ లో ధర్నా చేయడంతో పాటు ఢీల్లీ వెళ్ళి కేంద్రంతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఇదిగో ఇటువంటి సమయంలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై తెలంగామ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. బాయిల్డ్‌ రైస్ కొనమని కేంద్రం చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ తెలిపారు. బీజేపీని నమ్ముకుంటే సర్వనాశనం కావాల్సిందేనని మండి పడ్డ ముఖ్యమంత్రి, మత చిచ్చు పెట్టి దేశ సమగ్రతను దెబ్బతీస్తారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

CM KCR 1 1

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దేశంలో విభజన రాజకీయాలు చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. ఏడేళ్లలో బీజేపీ ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలని నిలదీశారు. కేంద్రం దుష్ట పాలనతో దేశంలో ఆకలి కేకలు పెరిగాయని కేసీఆర్ విమర్శించారు. కేంద్రానికి సామాజిక బాధ్యత ఉంటే వెంటనే తెలంగాణలో ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. దేశంలో రైతులు బాగుపడాలి, వ్యవసాయం బాగుండాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాల్సిందేనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను వంద శాతం ముంచుతోందని మండిపడ్డారు. బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.750 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో గత రెండేళ్లలో పేదరికం బాగా పెరిగిందని ఆయన చెప్పారు. దేశంలో ప్రతి వ్యవాస బోర్‌ దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించడంపైనా కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.