మళ్లీ ప్రత్యక్ష్యమైన చెడ్డీ గ్యాంగ్, జనంతో పాటు పోలీసులు వెన్నులో వణుకు

సంగారెడ్డి క్రైం- చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే జనమే కాదు.. పోలీసులు సైతం వణికిపోతారు. మరి చెడ్డీ గ్యాంగ్ అరాచకాలు అలా ఉంటాయి. కేవలం చెడ్డీలు మాత్రమే ధరించి దొంగతనాలకు పాల్పడటం ఈ గ్యాంగ్ ప్రత్యేకత. శివారు ప్రాంతాల్లోని తాళాలు వేసిన ఇళ్లను చెడ్డీ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. లేదంటే ఒంటరిగా ఎవరైనా ఉండే ఇళ్లను ఎంచుకుని, పగటి పూట రెక్కీ నిర్వహించి, రాత్రి పూట దోపిడి చేయడం చెడ్డీ గ్యాంగ్ స్టైల్.

ఇక వీరు దొంగతనం చేయాలనుకుంటున్న ఇళ్ల తాళాలను, తలుపులను చాలా చాకచక్యంగా ఐరన్ రాడ్డుతో ఒక్క వేటుతో పగలకొడతారు. ఇంట్లో ఎవరు లేకపోతే ఎంచక్కా దోచుకుంటారు. ఎవరైనా ఉంటే వాళ్లపై దాడి చేస్తారు, ఎదురు తిరిగితే ఒక్కోసారి ప్రాణాలు సైతం తీస్తారు. కదలలేని స్థితికి వచ్చే వరకు కొట్టి, ఆ తరువాత దొరికినంతా దోచుకేళ్తారు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు. అందుకే చెడ్డీ గ్యాంగ్ అంటే పోలీసులకు కూడా భయం పట్టుకుంది.

cheddi gang 2

ఇక చాలా రోజుల తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెడ్డీగ్యాంగ్ కదలికలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి వేళ చెడ్డీగ్యాంగ్ సభ్యులు తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు చెడ్డీగ్యాంగ్ సభ్యులను చూసి అవాక్కయ్యారు.

అమీన్ పూర్ లో అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ కదలికలను పోలీసులు పరిశీలించారు. అమీన్‌ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెదిరి టౌన్ షిప్‌ లో చెడ్డీ గ్యాంగ్ కదలికలు కనిపించాయి. ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడటంతో బాధితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అమీన్‌ పూర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వెదిరి టౌన్ షిప్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలించి అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపుచేపట్టారు.