పెళ్లైన 16 రోజులకే తనువు చాలించింది.. బాత్ రూంలోకి వెళ్లి..

గుంటూరు- ఇరవై ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుకు తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఎన్నో ఆశలతో అత్తారింటికి వెళ్లిన ఆ యువతి కాళ్ల పారాణి ఆరకముందే తనువు చాలించింది. అసలేం జరిగిందో తెలియక కన్నవాళ్లు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ కూతురికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందని రోధిస్తున్నారు.

ఈ విషాధ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన యువతి 16 రోజులకే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకోవడం సంచలనం రేపుతోంది. నగరం మండలం ఈదుపల్లికి చెందిన సాంబ శివారెడ్డి కుమార్తె కోటి చైతన్యకు, దాసరిపాలానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి కోటి గోపిరెడ్డితో రెండు వారాల క్రితం పెళ్లి జరిగింది. పదహారు రోజుల పండుగ నిమిత్తం రెండు రోజుల క్రితం వధువు కోటి చైతన్యను ఆమె కుటుంబ సభ్యులు అత్తారింకి పంపించి వెళ్లిపోయారు.

Chaitanya 2

మరి ఇంతలో ఏంజరిగిందో తెలియదు కానీ, 15న సాయంత్రం బాత్రూమ్‌లోకి వెళ్లిన చైతన్య ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో అనుమానం రావడంతో భర్త గోపిరెడ్డి వెళ్లి పిలిచినా ఆమె పలకలేదు. ఇక లాభం లేదని తలుపులు బద్దలు కొట్టి చూడగా చైతన్య ఉరి వేసుకొని కనిపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కిందికి దించి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.

పెళ్లైన నాటి నుంచి భర్త, అత్తమామలు తమ కూతురు చైతన్యను వేధించేవారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వారు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పెళ్లైన 16 రోజులకే కూతురు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.