వణికిస్తున్న ఓమిక్రాన్ వేరియెంట్.. టీకాలు పనిచేసేనా?

new variant

ప్రపంచ దేశాలలో కరోనా ప్రభావం తగ్గిందని సంతోషించే లోపే మళ్లీ కొత్త కొత్త వేరియెంట్స్ రూపంలో భయపెడుతుంది. ఇదివరకే రెండుసార్లు లాక్ డౌన్ వేసి మరీ జనాలను రక్షించుకునే ప్రయత్నం చేసిన అన్ని దేశాలు ఇప్పుడు మరోసారి ఆందోళన చెందే వేరియెంట్ వచ్చి వణికిస్తుంది. అదే ఓమిక్రాన్ వేరియెంట్. దక్షిణాఫ్రికా దేశంలో ఆల్రెడీ ఈ వేరియెంట్ పదుల సంఖ్యలో జనాలను ఆసుపత్రుల పాలుచేసింది. మరికొంత మంది దీని బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.

ఇలాంటి తరుణంలో ఇంతవరకు ఓమిక్రాన్ వేరియెంట్ కు సంబంధించి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది.. మరి ఈ వేరియెంటును ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ టీకా పనిచేస్తుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అందులోను ఇంతవరకు వైద్య నిపుణులు కూడా ఈ వేరియెంట్ పై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ఇది నిరాశపడే విషయమే అయినప్పటికీ, తాజాగా కోవిడ్ టీకా తయారీలో భాగస్వామ్యం అయినటువంటి బయోఎన్ టెక్ సీఈఓ ఉగుర్ సాహిన్ ప్రజలు ఎలాంటి ఆందోళన పడే అవసరం లేదని చెప్పుకొచ్చారు.

అయన మాటలతో జనాలకు కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలు ఓమిక్రాన్ వేరియెంట్ ను ఎదుర్కోవడంలో సఫలం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఐతే టీకా వేసుకున్న వారిలో కూడా ఈ వేరియెంట్ కేసులు బయటపడొచ్చని, వాక్సిన్ ప్రభావం వలన వేరియెంట్ నుండి ప్రమాదం తప్పవచ్చని కూడా సాహిన్ చెప్పుకొచ్చారు. చివరిగా బూస్టర్ డోస్ వేగవంతం చేస్తే సరిపోతుందని సాహిన్ ఊరట కలిగించారు.