సోమశిల ప్రాజెక్టు తెగిందన్న వదంతులు.. ప్రాణాలు గిప్పిట్లో పెట్టుకుని ప్రజలు పరుగులు..

Somasila Dam

అకాల వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. క్షణం క్షణం ప్రాణాలను అరచేత పెట్టుకుని బతుకుతున్న వారిని కొందరు తప్పుడు ప్రచారాలతో భయాందోళనకు గురి చేస్తున్నారు. సోమశిల డ్యామ్‌ తెగిపోయిందని ప్రచారాలు చేశారు. ఆ వదంతులతో నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో సాలుచింతల, స్టాబిడి కాలనీ ప్రాంత వాసులు హడలిపోయారు. చేతికి అందిన సామానులను చేత పట్టుకుని పరుగులు పెట్టారు. ముసలి వాళ్లు, చిన్న పిల్లలను తీసుకుని బతుకు జీవుడా అంటూ ఉరుకులు పెట్టారు.

సోమశిల ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పూ లేదని జిల్లా అధికారులు వచ్చి మొత్తుకునే పరిస్థితి ఏర్పడింది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరేంద్ర ప్రసాద్‌ అఫీషియల్‌ అనైన్స్‌మెంట్‌ చేసేదాకా అందరూ భయంతోనే ఉన్నారు. వరదలపై సమాచారం ఇవ్వలేదని అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు వెల్లడించారు. ప్రజల భయాలతో ఆటలాడుకునే కొందరు ఆకతాయిల గురించి మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.