వచ్చాడయ్యో సామీ… మరి మందు ఎప్పుడొస్తుందో తెలీదు సుమీ!..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్య నిపుణుడు బొడిగ ఆనందయ్య మీడియా ముందుకొచ్చారు. తనను అరెస్టు చేశారని, నాటు మందు పంపిణీ ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారంపై నోరు విప్పారు. ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారని, ప్రభుత్వం సంపూర్ణంగా సపోర్ట్ చేస్తోందని వెల్లడించారు. వాళ్లందరికీ ఆనందయ్య ధన్యవాదాలు తెలిపారు. రెండ్రోజుల్లో మందు తయారు చేసి పంచిపెడతారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ఆయుర్వేద మందు పంపిణీ ఆగిపోయిన తర్వాత ఆనందయ్యను పోలీసులు నెల్లూరుకి తరలించడం, కృష్ణపట్నంలో ఆయుష్ బృందం పర్యటన, ఆ తర్వాత పలు రాజకీయ పార్టీల నేతల పర్యటన అంతా చకచకా జరిగిపోయాయి. ఆయుష్ నివేదికను కేంద్రానికి పంపించిన రాష్ట్రం, కేంద్ర సంస్థ అనుమతి కోసం వేచి చూస్తోంది. అటు హైకోర్టులో కూడా ఆనందయ్య కేసు విచారణకు వచ్చింది, త్వరగా తేల్చండి, ప్రజల ప్రాణాలు కాపాడండి అని కోర్టు సూచించింది.

Krishnapatnam1 1200x675 1

ఇక మిగతా విషయాలకొస్తే ఆనందయ్యతో స్థానిక నాయకులు కొంతమంది మందు తయారు చేయించారని, తమ అనుచరులకు, బంధువులకు ఆ మందు పంచి పెట్టారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయుష్ డిపార్ట్ మెంట్ వారు కోరితేనే నమూనా కోసం తాను మందు తయారు చేశానని ఆనందయ్య వివరణ ఇచ్చారు. తన వద్ద తగినన్ని మూలికలు లేవని ఆయన చెప్పారు. సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు అందిన వెంటనే తర్వాతి రెండో దశ ప్రయోగాలు ప్రారంభించనున్నారు. సుజన్‌ ల్యాబ్‌లో జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. సుజన్‌ లైఫ్ ల్యాబ్‌ నుంచి 15 రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది.