శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు జారీ – ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు మాత్రమే!!

సుదీర్ఘ విరామం తర్వాత టీటీడీ తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెట్లు జారీ చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభమైంది. రోజుకు 2 వేల సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించారు. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్లలో ఈ టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించన్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అది కూడా ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో సర్వదర్శనం కోసం చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తిరుపతికి చేరుకున్నారు.

Srivari Sarvadarshanam tokens issued - Suman TVఅర్ధరాత్రి ఒంటిగంట నుంచే సర్వదర్శనం టికెట్ల కోసం క్యూ లైన్‌లలో వేచి ఉన్నారు. టికెట్లు దొరికిన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ భక్తులు ఎవ్వరూ అసహనానికి గురికాలేదు. ఎన్నో రోజులుగా స్వామివారి దర్శనం కోసం వేచిచూస్తోన్న భక్తులు  టోకెన్ల కోసం మరికాసేపు వేచిచూడలేమా అన్నట్టు క్యూలైన్లలో నిలబడ్డారు. ఇక టోకెన్లు అందుకున్నాక వారి ఆనందానికి అవధుల్లేవు. టోకెన్ల జారీ విషయంలో టీటీడీ కోవిడ్ నిబంధనలను పాటించలేదు అని విమర్శలు వస్తున్నప్పటికీ భక్తులు మాత్రం అవేమీ పట్టించుకోవడంలేదు.

కరోనా దృష్ట్యా ఏప్రిల్‌ 11 నుంచి ఈ టోకెన్ల జారీని నిలిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను పొందిన భక్తులకు టోకెన్లు ఇవ్వడం లేదు. ఒకసారి దర్శనం అనంతరం నెల వ్యవధి ఉంటేనే టోకెన్ల ఇస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌తో ఏప్రిల్‌ మొదటివారం నుంచి ఆంక్షలు విధించారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో సర్వ దర్శనానికి అనుమతి లభించింది.   చాలా రోజుల తర్వాత శ్రీవారి సర్వదర్శనానికి అవకాశం రావడంతో టోకెన్ల కోసం భక్తులు తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్‌లోని కౌంటర్లకు భారీగా తరలివచ్చారు