2024లో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమా?

TDP vs Janasena

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉండగానే పొత్తుల చర్చలు తెర మీదకు వచ్చాయి. కుప్పం సభలో చంద్రబాబు కామెంట్స్‌ తో మరోసారి టీడీపీ- జనసేన పొత్తు అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. చంద్రబాబు కామెంట్స్‌ పై జనసేనాని స్పందించినప్పటికీ ఇంకా సరైన క్లారిటీ రాలేదు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ.. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుంపటి మారదని గట్టిగా చెప్పే పరిస్థితి కూడా లేదు. 2024 ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కుప్పం సభలో జనసేనతో పొత్తు విషయంలో చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అప్పటి నుంచే ఈ పొత్తు అంశం ఇంత ముందుగా తెర మీదకు వచ్చింది. కార్యకర్తలు అందరూ జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చుగా అని అభిప్రాయపడ్డారు. ఆ సందర్భంగా ‘ప్రేమ అనేది రెండువైపులా ఉండాలి. వన్‌ సైడ్‌ లవ్‌ ఎప్పుడూ ఫలించదు’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఆ వన్‌ సైడ్‌ టీడీపీదా? జనసేనదా? అనే అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఆ కామెంట్స్‌ పై తాజాగా పవన్‌ కల్యాణ్‌ కూడా స్పందించారు. పొత్తుల విషయంలో ప్రత్యర్థుల మైండ్‌ గేమ్స్‌ లో పడొద్దని పన్ కామెంట్స్ చేశారు. జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. పొత్తుల కంటే పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణమే ముఖ్యమని జనసేనాని కామెంట్‌ చేశారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వంపై దృష్టి సారించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అయితే ఇప్పుడు పవన్‌ కామెంట్స్‌ ను మరో కోణంలోనూ తీసుకుని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఏదీ తేల్చి చెప్పలేదని.. ఖండించలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

TDP vs Janasena

బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు కలిసొచ్చింది ఏమీ లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటు తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికులు, అటు తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాసం కూడా దక్కలేదని కార్యకర్తలు కూడా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో కలిసి పోటీ చేస్తే.. అధికారం దక్కే అవకాశం అయినా ఉంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌ ను ఓసారి గమనిస్తే.. పవన్‌ కల్యాణ్‌ ఎక్కడా కూడా టీడీపీతో పొత్తు ఉండదు, ఉండబోదు అని ఖండించలేదు.

అందరితో కలిసి చర్చించాకే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పవన్‌ వ్యాఖ్యానించారు. పొత్తులు ప్రజాస్వామ్యంగా, ఆమోదయోగ్యంగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని చెప్పారు. కానీ, ఎక్కడా మనం బీజేపీతో పొత్తులో ఉన్నాం.. వారితోనే కలిసి పోటీ చేసేది అని తేల్చి చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తప్పకుండా టీడీపీ- జనసేన కలిసే పోటీ చేస్తాయని ఇరు వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. పలు రాజకీయ పార్టీలు జనసేనతోనే పొత్తు కోరవచ్చని పవన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కర్ర విరగకుండా.. పాము చావకుండా జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో పొత్తు రాజకీయాలపై మరింత ఆసక్తి, ఉత్కంఠను నెలకొల్పుతున్నాయి. 2024లో టీడీపీ- జనసేన కలిసే పోటీ చేస్తాయా? మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.