ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీ నుంచి గెలిచిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు..అంతేకాదు, ఆ పార్టీ నేతలపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు లోనయ్యారు. పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చేరి వంశీ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని మొహాలీ వైద్యులు ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే..
ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ), హైదరాబాద్‌లో గతేడాది సీటు సాధించి అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ(ఏఎంపీపీపీ) కోర్సు చేస్తున్న ఆయన సోమవారం నుంచి పంజాబ్ రాష్ట్రం మొహాలీ క్యాంపస్‌లో ఆఫ్‌లైన్ తరగతులకు వెళుతున్నారు. ప్రస్తుతం మూడో సెమిస్టర్ తరగతులు జరుగుతున్నాయి. అక్కడే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఎడమ చేయి తీవ్రంగా లాగడంతో ఇబ్బంది పడ్డ వంశీ.. వెంటనే ఆసుపత్రిలో చేరారు. వైద్యులు వంశీకి ఈసీజీ, 2 డీ ఎకో, వంటి పరీక్షలు నిర్వహించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని సూచించారు.
ప్రస్తుతం వల్లభనేని వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. వంశీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని తెలియడంతో గన్నవరం ప్రాంతంలో ఆయన అభిమానులు ఆందోళనకు గురైయ్యారు. పలువురు వైసీపీ నేతలు వంశీ ఆరోగ్యంపై వాకబు చేసి పరామర్శించినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉంటే.. టీడీపీ నుంచి గెలిచిన వంశీ.. ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సీఎం జగన్‌ను పలుమార్లు కలిసిన ఆయన.. వైసీపీ కి సన్నిహితంగా ఉంటున్నారు.