ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. పుష్పలో అల్లు అర్జున్ మాస్ స్టెప్స్ అదుర్స్

ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై అంతకంతకు క్రేజ్ పెరుగుతోంది. ఈ భారీ సినిమా వచ్చే నెలలో విడుదల కానున్న నేపథ్యంలో కొత్త అప్‌ డేట్స్‌ తో అంచనాలను అంతకంతకూ పెంచేస్తోంది చిత్ర యూనిట్.

ఇప్పటికే విడుదలైన పుష్ప ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప సినిమా నుంచి మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇక తగ్గేదే లే అన్నట్లుగా అదే బాటలో సినిమా నుంచి నాలుగో పాట ప్రోమో వీడియో విడుదల చేసింది పుష్ప యూనిట్.

Pushpa 1

ఈ వీడియో సాంగ్ ప్రోమోలో .. ఏ బిడ్డా ఇది నా అడ్డా.. అంటూ మాస్ ఎంట్రీతో అల్లు అర్జున్ తెగ ఆకట్టుకున్నారు. తనదైన మాస్ స్టెప్పులతో అల్లు వారబ్బాయి బాగా అలరించారు. పుష్పరాజ్ రూపంలో అల్లు అర్జున్ లుక్ అభిమానులను బాగా అలరిస్తోంది. ఇక పుష్ప సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అదుర్స్ అని చెప్పవచ్చు. అన్నట్లు ఈ వీడియో సాంగ్ ఫుల్ వీడియో నవంబర్ 19 ఉదయం 11: 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇందుకు సంబందించిన అఫీషియల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త సమర్పణలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ సరసన కన్నడ సోయగం రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా అనసూయ కీలకపాత్రలో నటిస్తోంది.