హైదరాబాద్ లో ఒక కప్పు టీ ధర వెయ్యి రూపాయలు, ఒక్కసారి తాగితే

హైదరాబాద్ టీ.. చాయ్.. తేనీరు.. పేరు ఏదైనా ఇది గొంతులో పడందే రోజు ప్రారంభం కాదు. ప్రపంచంలో చాలా మంది టీ తోనే రోజును మొదలుపెడతారు. టీ తాగందే కొంత మందికి ఏమీ తోచదు. టీ తాగాకే ఎంతో మంది తమ దినచర్యను ప్రారంభిస్తారు. మరి కొందరైతే రోజుకు ఎన్ని టీ లు తాగుతారో లెక్కేలేదు. మన భారతీయులకు టీని బ్రిటీష్ వాళ్లే అలవాటు చేసి వెళ్లారని చెబుతారు గాని అందులో ఏంతమేర వాస్తవం ఉందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేం.

ఇక అసలు విషయానికి వస్తే.. టీ మనం ఇంట్లో పాలు, పంచదార, టీ పొడితో ఇంట్లో తయారు చేసుకుంటాం. అదే బయట హోటల్ లో దాగాలంటే మాత్రం 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ధర ఉంటుంది. కాస్త పెద్ద హోటల్ అయితే 50 రూపాయల వరకు ఉండవచ్చు. ఇక ఫైవ్‌ స్టార్ హోటల్ అయితే 100 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య ఉంటుంది. కానీ ఒక్క కప్పు టీ ధర అక్షరాల 1000 రూపాయలు అంటే మీరు నమ్ముతారా..

nilofar 1

ఏంటీ కప్పు టీ ధర వెయ్యి రూపాయలా అని ఆశ్చర్యపోతున్నారా..హైదరాబాద్‌లోని ఓ కేఫ్‌ ఒక కప్పు టీని 1000 రూపాయలకు అమ్ముతోంది. ధరకు తగ్గట్టే దాని రుచి కూడా అమోఘంగా ఉంటుందట. అందుకే భారీ ధర ఉన్నప్పటికి దానికి డిమాండ్ కూడా అంతే రేజ్‌లో అందట. హైదరాబాద్ లోని ఇరానీ ఛాయ్ ఎంత ఫేమస్సో తెలుసు. లక్డీకాపూల్‌ లోని ప్రసిద్ద నీలోఫర్ కేఫ్‌లో ప్రత్యేకమైన పద్ధతుల్లో తయారు చేసే టీని కప్పు వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు. ఈ ఛాయ్ ముదురు బంగారు వర్ణంలో ఉంటుంది.

దీన్ని తయారు చేయడానికి వేసే చాయ్ పత్తా అత్యంత ఖరీదైనదట. మొగ్గల నుంచి తయారయ్యే ఈ చాయ్ పత్తా అస్సోంలోని బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతం మైజాన్‌ టీ తోటల్లో మాత్రమే లభిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే మొగ్గల ద్వారా ఈ పొడి తయారుచేస్తారు. వాటిని సూర్యోదయానికి ముందే కోసి ఆరపెట్టి పొడిగా చేస్తారు. అలా ఒక్కసారికి కిలో నుంచి కిలోన్నర మాత్రమే పొడి ఉత్పత్తి అవుతుంది. దీంతో ఈ పొడికి భారీ డిమాండ్ ఉంటుందట. ఈ చాయ్ పొడిని వేలంలో మాత్రమే దక్కించుకోవాలి.

ఇటీవల కోల్‌ కతాలో నిర్వహించిన వేలంలో నీలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు కిలో టీ పొడిని 75వేలకు కొన్నారు. అందువల్లే కప్పు టీకి వెయ్యి ధర నిర్ణయించి అమ్ముతున్నారు. ఇక ప్రత్యేకమైన ఈ టీలో పాలు కలపమని, డికాషన్ రూపంలో తాగితేనే మంచి టేస్ట్ ఉంటుందని బాబూరావు చెబుతున్నారు. ఒక కప్పు టీలో కేవలం 4గ్రాముల పొడిని కలుపుతామని ఆయన చెప్పారు. అది తాగితే అద్భుతమైన అనుభూతికి లోనవుతామని, ఆ ఛాయ్ రుచి వేరే టీలకు రాదని దాన్ని తాగినవారు చెబుతున్నారు.