తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహ మ్మారి మృత్యుఘోష!..

కొవిడ్ ప్రళయం అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతున్నది. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశంలోనూ ఒక్కరోజులో నమోదు కానన్ని కేసులు మనదేశంలో 24 గంటల్లో నమోదయ్యాయి. సెకండ్ వేవ్లో రెట్టింపు వేగంతో విస్తరిస్తున్న కరోనాను ఎలా కట్టడి చేయాలో అర్ధంగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. ప్రాణాలు వదులుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఓ వైపు కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య గతంలో ఎప్పుడూ లేనివిధంగా పెరుగుతుంటే… కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బుధవారం నాడు 7994 మందికి వైరస్ సోకింది. 58 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకి ఆస్పత్రికి వెళ్లిన వారు తిరిగి ప్రాణాలతో వస్తారా..? లేరో… ? అన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. ఒక్క వరంగల్ ఎంజీఎంలోనే గడిచిన 48 గంటల్లో 41మందిని కరోనా బలి తీసుకుందంటే రాష్ట్రంలో కరోనా మరణాలు ఏ స్థాయిలో నమోదవుతున్నాయో ఇట్టే తెలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 72 గంటల్లో కరోనా మహ మ్మారి 166 మందిని బలితీసుకుంది. బుధవారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 58 మంది కరోనాకు బలయ్యారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 52మందిని. మంగళవారం 56 మందిని కరోనా పొట్టన పెట్టుకుందియాంటిజెన్ కిట్లు సరిపడా లేకపోవడంతోపాటు సిబ్బంది కూడా తగినంత సమయం టెస్టులు చేయని పరిస్థితులు నెలకొన్నాయి. టెస్టింగ్ కిట్ల కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. 10 రోజులకు పైగా రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కిట్లకు కొరత కొనసాగుతోంది. సరిపోయేన్ని కిట్లకు ఆర్డర్ ఇచ్చామని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతున్నా క్షేత్రస్థాయిలోకి అవి అందుబాటులోకి రావడం లేదు. దీంతో కరోనా టెస్టుల కోసం పరీక్షా కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. తెల్లవారు జాము నుంచి బారులు తీరుతున్నారు. ఒక్కో టెస్టింగ్ కేంద్రంలో 50 మందికి మాత్రమే పరీక్షలు చేస్తుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఒకే పీహెచ్సీలో టెస్టులు చేయడంతోపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తుండడంతో గందరగోళం నెలకొంది. కరోనా యాంటిజెన్ కిట్లకు కొరత ఉండడంతో టెస్టులను తగ్గించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.