తెలంగాణలో మాస్కులు ధరించని వారికి ఫైన్ 31 కోట్లు

హైదరాబాద్- కరోనా ఆంక్షల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. భహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించకపోయినా, మాస్కులు ధరించకపోయినా ఫైన్లు విధిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో మాస్కులు ధరించని వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో మాస్కులు ధరించని వారిపై ఇప్పటి వరకు  3,39,412 కేసులు న‌మోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఇక వీరందరి నుంచి వసూలు చేసిన ఫైన్ లు ఎంతో తెలుసా.. అక్షరాల 31 కోట్ల రూపాయలు. అవును తెలంగాణలో మాస్కులు ధరించకుండా కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి వారి నుంచి 31 కోట్ల రూపాయలను వసూలు చేశారు పోలీసులు. ఈ విషయాలను కరోనాపై విచారణ సందర్బంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు ఇచ్చిన నివేధికలో తెలియజేశారు.

No mask

కరోనా విచార‌ణ‌ సందర్బంగా హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ పోలీస్ కమీషనర్లు కోర్టుకు హాజ‌ర‌య్యారు. తెలంగాణ‌లో లాక్‌ డౌన్‌, క‌రోనా నిబంధ‌న‌ల‌పై డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించారు. క‌రోనా నేప‌థ్యంలో క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. బ్లాక్ మార్కెట్‌ లో ఔష‌ధాల అమ్మ‌కాన్ని నిరోధిస్తున్నామ‌ని, ఇప్ప‌టికి 98 కేసులు న‌మోదు చేశామ‌ని వివ‌రించారు.  లాక్‌ డౌన్  ప‌క‌డ్బందీ అమ‌లు కు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 1 నుంచి 14 వ‌ర‌కు నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల కింద మొత్తం 4,31,823 కేసులు న‌మోదు చేశామ‌ని చెప్పారు. ఇక భహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించ‌నందుకు న‌మోదయిన మొత్తం కేసులు 22,560 అని వివ‌రించారు. లాక్‌డౌన్‌, రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్య‌క్తం చేసింది.