వారెవ్వా.. కేరళ పోలీసుల డాన్స్ అదుర్స్

తిరువనంతపురం (నేషనల్ డెస్క్)- భారత్ లో కరోనా విజృంభన అంతకంతకు పెరిగిపోతోంది. దేశంలో కరోనా పెరుగుదలకు కోవిడ్ నిబంధనలను చాలా మంది పాటించకపోవడమే కారణం. అధికారులు, నిపుణులు పదే పదే చెబుతున్నా కొందరు ఏ మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. ఈ క్రమంలో కరోనా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు కేరళ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన ఎంజాయి ఎంజామి పాటకు కరోనా నిబంధనలు పాటించాలని అర్థం వచ్చేలా పేరడీని రూపొందించారు కేరళ పోలీసులు. దానికి తగ్గట్టుగానే డ్యాన్స్ చేసిన ఓ వీడియోను తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో కేరళ పోలీసులు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కరోనా సమయంలో అందరు జాగ్రత్తలు తీసుకోవాలి.. మాస్క్‌ తప్పకుండా ధరించాలి.. పోలీసులకు, సమాజానికి భయపడి మాత్రమే మాస్క్‌ పెట్టుకోవడం కాదు.. దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి.. భౌతిక దూరం పాటించాలి.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోతాయి.. అందరం కలిసి కరోనా లేని భవిష్యత్తు కోసం పోరాడదాం.. అనే సందేశంతో ఈ వీడియోను రూపొందించారు.

ఒకటిన్నర నిమిషాల నిడివున్న ఈ వీడియోను రెండు రోజుల క్రితం పోస్ట్ చేయగా అందరికి తెగ నచ్చేసింది. ఈ వీడియోకు పోలీస్ మీడియా సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ వీపీ ప్రమోద్ కుమార్ దర్శకత్వం వహించగా.. హేమంత్ నాయర్, షిఫిన్ సీ రాజ్, రాజీవ్ సీపీలు కెమెరా మెన్‌లుగా వ్యవహరించారు. మరి కేరళ పోలీసులు చేసిన డాన్స్ ను మీరు చూసెయ్యండి. కేవలం డాన్స్ ను చూడటమే కాదు అందులో చెప్పినట్లు కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలి.