రాజకీయాలకు గుడ్ బై, ఇక ఎన్నికల్లో పోటీ చేయను- జానారెడ్డి

హైదరాబాద్- కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఓటమితో జానారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన గౌరవం కోసం నాగార్జునసాగర్‌లో పోటీ చేసినట్లు జానారెడ్డి చెప్పారు. ధర్మంతో, ప్రజాస్వామ్య విలువలతో ఎన్నికల్లో పాల్గొన్నానని ఆయన అన్నారు. ఒక కొత్త ఒరవడిని తెద్దామని చేసిన విజ్ఞప్తిని పార్టీలు పట్టించుకోలేదని జానా రెడ్డి వాపోయారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండదలుకున్నానని స్పష్టం చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని జానా రెడ్డి తేల్చి చెప్పారు.

తన వారసుడిని పోటీకి పెట్టాలా లేదా అనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికలో గెలుపుపై ధీమాతో ఉన్న జానా రెడ్డి ఓటమితో తీవ్ర నిరాశ చెందారు. అందుకే ప్రత్యక్ష రాజకీయల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని సన్నిహితులు చెబుతున్నారు.