రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్, కరోనాపై సీఎస్ కు ఆదేశాలు

హైదరాబాద్- ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను ఆశాఖ నుంచి తప్పించిన వెను వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు చెప్పారు. ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రెమ్‌డెసివర్, వాక్సీన్‌, ఆక్సీజన్, ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో గానీ ఏ మాత్రం లోపం రానీయవద్దని సీఎస్‌కు సీఎం కేసీఆర్ సూచించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గానూ  ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డిని కేసీఆర్ నియమించారు.

ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. అధికారులంతా చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణను కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు తాను స్వయంగా కరోనాపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.