బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మమత, మూడోసారి అధికారంలోకి దీదీ

కోల్ కత్తా (నేషనల్ డెస్క్)- పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఎన్నికల ప్రచారంలో టీఎంసీతో తో నువ్వా నేనా అన్న విధంగా పోటీపడిన బీజేపీ చతికిలపడిపోయింది. మొత్తం 292 స్థానాలకు గాను 213 స్థానాల్లో టీఎంసీ విజయకేతనం ఎగుర వేసింది. మరోవైపు దీదీని ఈ సారి ఎలాగైనా దెబ్బకొట్టి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంలో సర్వశక్తులూ ఒడ్డిన బీజేపీ కేవలం 75 స్థానాలు గెలుపొందగా, మరో రెండుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు రెండు చోట్ల గెలుపొందారు. గత ఎన్నికల్లో కేవలం 3 స్థానాలు మాత్రమే దక్కించుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో బాగా పుంజుకుంది. అయితే తనను ఢీకొట్టాలంటే ఇది చాలదని మమత భారతీయ జనతా పార్టీకి గట్టి హెచ్చరికలే పంపించింది. మోదీ, షాల అభివృద్ధి నినాదం దీదీ చరిష్మా ముందు నిలబడలేకపోయింది. అయితే నందిగ్రామ్‌‌ నియోజకవర్గంలో మమతను ఓడించామన్నది బీజేపీకి కాస్త ఊరటనిచ్చే అంశం.

అయితే నందిగ్రామ్‌లో ఓడిపోయినప్పటికీ, పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో తానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్‌లో నిరుద్యోగం విషయంలోనూ బీజేపీ వ్యూహాలకు మమత చెక్‌ పెట్టారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని బీజేపీ ప్రచారం చేయగా, మరోసారి తనకు అధికారమిస్తే ప్రతి సంవత్సరం ఐదు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని మమత మ్యానిఫెస్టోలో ప్రకటించారు.