తెలంగాణ మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్

హైదరాబాద్- తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్‌ చేసింది. తెలంగాణ కేబినెట్‌ నుంచి ఈటలను బర్తరఫ్‌ చేస్తున్నట్లు గవర్నర్‌కు సీఎం కార్యాలయం అధికారులు లేఖ పంపారు. అవకాశం ఇచ్చినా రాజీనామా చేయకపోవడంతో ఈటలను బర్తరఫ్‌ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. శనివారం ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖను తొలగించి, ఆ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు బదలాయించారు. దీంతో ఈటల మంత్రి పదవికి రాజీనామా చేస్తారని అంతా భావించారు. కానీ ఈటల రాజీనామా చేయకపోవడంతో ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈటల బర్తరఫ్‌ విషయాన్ని మీడియాకు గవర్నర్‌ కార్యాలయం అధికారికంగా తెలిపింది.

ఇక నుంచి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. మెదక్ జిల్లా అచ్చంపేటలో 66 ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఈ నేపధ్యంలోనే ఈటలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు.