ఓటమి పాలైన కమల్ హాసన్, అడ్రస్ లేని మక్కల్ నీది మయ్యమ్

చెన్నై (నేషనల్ డెస్క్)- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు . కోయంబత్తూర్ నియోజకవర్గంలో తన ప్రత్యర్ధి అభ్యర్ధిపై 1728 ఓట్ల తేడాతో కమల్ ఓడిపోయారు. ఓట్ల మెజారిటీ చాలా తక్కువగా ఉండటంతో అక్కడ రీకౌంటింగ్ చేయాలని కమల్ హాసన్ డిమాండ్ చేశారు. దీంతో అధికారికంగా ఫలితం వెలువడటానికి మరికొంత సమయం పట్టనుంది. తమిళనాడు ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాడనుకున్న కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ ఎక్కడా అడ్రస్ లేకుండా పోయింది.
అయితే తన పార్టీ తరపున ఒకే ఒక్కడుగా ఆయన స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని అంతా భావించినప్పటికీ చివరి నిమిషంలో ఓటమిపాలయ్యారు. దాదాపు ప్రతి రౌండ్ లోనూ కమల్ హాసన్ స్వల్ప ఆధిక్యంతో ముందుంజలో ఉన్నారు. కానీ చివరికి వచ్చే సరికి కమల్ హాసన్ పై ప్రత్యర్ధి అభ్యర్ధి 1728 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.