కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

discover 1
cm kcr

ఎర్రవల్లి- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్ లో సీఎంకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్‌ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా, రెండు పరీక్షల్లోను నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. ముఖ్యమంత్రికి గతనెల 28న నిర్వహించిన యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు మిశ్రమ ఫలితాలు రావడంతో మళ్లీ తాజాగా పరీక్షలు నిర్వహించారు. గతంలో యాంటీజెన్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లో నెగెటివ్‌ రాగా, ఆర్టీపీసీఆర్‌ పరీక్ష రిపోర్ట్‌లో కచ్చితమైన ఫలితం రాలేదని వైద్యులు తెలిపారు.

వైరస్‌ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని డాక్టర్‌ ఎంవీ రావు అన్నారు. ఇప్పుడు నిర్వహించిన రెండు పరీక్షల్లోను నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారని డాక్టర్లు చెప్పారు. ముఖ్యమంత్రికి నిర్వహించిన ఇతర రక్త పరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో చాలా రోజులుగా ఫాంహౌజ్ కే పరిమితం అయిన సీఎం కేసీఆర్ ఒకటి రెండు రోజుల్లో ప్రగతి భవన్ రానున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపధ్యంలో అధికారులతో అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.