ఏపీలో బుధవారం నుంచి పగటి పూట కర్ఫ్యూ

అమరావతి- ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ పై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గించడం, బెడ్‌ల కొరత నివారించేందుకు అవసరమైన చర్యలపై సీఎం దృష్టి సారించారు. అధికారులతో సమీక్ష తరువాత ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బుధవారం నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇవ్వనున్నారు. 12 గంటల తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ ఆంక్షలను రెండు వారాల పాటు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పగటి పూట కర్ఫ్యూ సమయంలో 144వ సెక్షన్‌ అమలులో ఉండనుంది. ఏపీలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉండగా, కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో పగచి పూట కర్ఫ్యూపై నిర్ణయం తీసుకున్నారు.