ఇక ఏ రాజకీయ పార్టీకి వ్యూహరచన చేయను- ప్రశాంత్ కిశోర్

న్యూ ఢిల్లీ (నేషనల్ డెస్క్)- బీజేపీ సహా పలు రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలకు సంచలన విజయాలను సాధించిపెట్టిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి ఆయన వ్యూహాలతో విజయాన్ని సాధించిపెట్టారు. దీంతో ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ తదుపరి వ్యూహరచన ఏ రాష్ట్రంలో ఉండబోతోందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పీకే సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల వ్యూహకర్తగా తాను వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను చేస్తున్న పనినే కొనసాగించాలని అనుకోవడం లేదని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

ఇప్పటికే చాలా చేశానన్న ఆయన.. తాను ఇక బ్రేక్ తీసుకునే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. జీవితంలో ఇంకేదో చేయాలని.. ఈ రంగం నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని పీకే చెప్పుకొచ్చారు. ఇక తాను విఫల రాజకీయనాయకుడినన్న ప్రశాంత్ కిశోర్.. ప్రస్తుతం వెనక్కి వెళ్తున్నాను.. ఏం చేయాలనేది చూడాలని అన్నారు.