ఏపీలో సినిమా థియేటర్లు, సినిమా టికెట్ల అంశం చినికి చినికి గాలివానగా మారింది. ఎందరో ప్రముఖులు, సినిమా పెద్దలు ఇప్పటికే ఈ అంశంపై స్పందించారు, చర్చించారు. తాజాగా ఈ అంశంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఏపీ మంత్రులతో థియేటర్ల అంశంపై చర్చిస్తానంటూ తెలిపారు. ‘తెలంగాణలో అఖండ, పుష్ప సనిమాలతో సినిమా రంగం తిరిగి పుంజుకుంటోంది. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచాము. అదనంగా ఐదో షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చాం. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి సినిమా రంగానికి మద్దతుగానే ఉంది. సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే. సినిమాకు కులం, మతం, ప్రాంతాలు ఉండవు. హైదరబాద్ సినిమా హబ్ కావాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. సినీ పరిశ్రమపై ఆధారపడి వేల మంది కార్మికులు జీవిస్తున్నారు. తెలంగాణలో థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. తెలంగాణ ప్రభుత్వం సందర్భాన్ని నిర్ణయం తీసుకుంటుందే తప్ప.. ఎలాంటి బలవంతపు నిర్ణయాలు తీసుకోదు. ఏపీలో సినిమా థియేటర్ల విషయంపై అక్కడి మంత్రులతో మాట్లాడతా’ అంటూ మంత్రి తలసాని తెలిపారు. అయితే ఏపీలో సినిమా థియేటర్ల అంశంపై ఇప్పటికే చాలా మంది చర్చించారు. కానీ, ఎక్కడా చర్చలు సఫలమైనట్లు దాఖలాలు లేవు. తాజాగా రామ్ గోపాల్ వర్మ- మంత్రి పేర్ని నాని భేటీ కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. అయితే కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి, తెలంగాణ మంత్రి తలసాని ఏపీ మంత్రులతో ఎప్పుడు చర్చిస్తారు? ఆ చర్చల సారాశం ఏదైనా ప్రభావం చూపుతుందా అనేది వేచి చూడాలి. మంత్రి తలసాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.