సినిమా డైరెక్టర్స్ కు ఆమె ఫోన్, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ విన్నపం

ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి కష్టాల్లో పడిపోయింది. రియా చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆమెకు సినిమాల్లో కంటే సుశాంత్ కేసు కారణంగానే చాలా పాపులర్ అయ్యింది. తెలుగులో తూనీగ.. తూనీగ అనే సినిమాలో కనిపించిన రియా.. ఆ తర్వాత బాలీవుడ్‌ వైపు వెళ్లిపోయింది. ముంబయిలో సుశాంత్‌ తో పరిచయం, ఫ్రెండ్ షిప్, ప్రేమ ఇలా అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి. సుశాంత్ రికమండేషన్ తో రియా బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో హఠాత్తుగా సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం, మాదకద్రవ్యాల వ్యవహారంలో రియా ప్రమేయం ఉన్నట్లు తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిగిన ఆ తర్వాత ఆమెకు జైలు శిక్ష పడటంతో.. గత ఏడాది అక్టోబర్‌లో శిక్ష పూర్తి చేసుకొని జైలు నుంచి రియా విడుదలైంది.

కానీ జైలు నుంచి వచ్చాక రియాకు అన్ని చేదు అనుభవాలే ఎదురయ్యాయి. సుశాంత్ ఆత్మహత్యకు రియానే కారణమని బాలీవుడ్ అంతా ఆమెని టార్గెట్ చేసింది. దీంతో అప్పటికే ఆమెతో సినిమాలు ఒప్పుకున్న నిర్మాతలు, దర్శకులు సినిమాలను రద్దు చేసుకున్నారు. కొత్త వాళ్లు కూడా రియాతో సినిమాలను తీసేందుకు వెనుకాడుతున్నారు. దీంతో బాలీవుడ్‌ ను ఏలాలనుకున్న రియా ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. ఇదిగో ఇలాంటి సమయంలో రియా చక్రవర్తి తెలుగు ఇండస్ట్రీవైపు చూస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తనకు ఏదైనా ప్రాజెక్టులో ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ టాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కు ఫోన్ చేసి అడుగుతోందట రియా. హీరోయిన్ గా కాకున్నా.. కనీసం సెకంట్ హీరోయిన్ గా అయినా పరవా లేదని బతిమాలుతోందని సమాచారం. మరి రియా విన్నపాన్ని తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా మన్నిస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.