ఈమధ్య సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాల గురించి మనస్పర్థలు రావడం.. మానసికంగా కృంగిపోవడం.. వెరసి ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది నటీనటులు.. తమ ప్రేమ విఫలమైందని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అనేకం జరిగాయి. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్.. తన ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదం మరువక ముందే మరో టీవి నటి ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా ఆత్యహత్యకు పాల్పడింది. జూన్ 18 రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన రష్మీ రేఖ ఓజా ఒడియాలోని పలు సీరియల్ లో నటించింది. 'కెమిటి కహిబి కహా' అనే ఒడియా సీరియల్తో గుర్తింపు పొందింది. అయితే 23 ఏళ్ల రష్మీ రేఖ ..కొన్నాళ్లుగా సంతోష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జూన్ 18న భువనేశ్వర్ లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తన మరణానికి ఎవరు కారణం కాదని తెలిపింది. ఇంకా 'ఐ లవ్ యూ సాన్' అని నోట్ లో రాసి ఉంది. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే రష్మీ ఒక్కతే ఉంటున్నట్లు తెలుస్తోంది. రష్మీ మరణానికి సంతోష్ కారణమై ఉండొచ్చని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. 'జూన్ 18 రష్మీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, తర్వాత రష్మీ చనిపోయినట్లు సంతోష్ మాకు చెప్పాడు. సంతోష్, రష్మీ భార్యాభర్తలుగా నివసిస్తున్నట్లు ఇంటి యజమాని చెప్పేంత వరకు ఆ విషయం మాకు తెలియదు.' అని రష్మీ రేఖ తండ్రి తెలిపారు. మరి.. ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.