మళ్ళీ వస్తున్నాయా…మల్టీస్టారర్‌ మూవీస్!

టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరూ ఒకే చోట కలిశారంటే సినీ ప్రియులకు పండగే. బిగ్‌బాస్-4 ఫైనల్లో చిరంజీవి, నాగార్జున కలిసి సందడి చేస్తే చూసేందుకు రెండు కళ్లూ చాల్లేదు. వీరికి మరో స్టార్ హీరో వెంకటేశ్ జతకలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పైగా ఈ ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఇండస్ట్రీలో అంతకంటే హైప్ ఇంకేముంటుంది. అలాంటి క్రేజీ కాంబినేషన్‌కి 25ఏళ్ల క్రితమే పునాది పడినా.. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు్ ఆగిపోయింది.
ఒక టికెట్టుపై డబుల్‌ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్‌ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్‌ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. అదే ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి నటిస్తున్నారని చెబితే.. ఇక ఆ అంచనాలు ఆకాశాన్నే తాకుతాయి. దీన్ని దృశ్య రూపంలోకి తీసుకురావడం దర్శక నిర్మాతలకు అంత సులువైన పని కాదు. కథానాయకుల ఇమేజ్‌ చట్రాల్ని దృష్టిలో పెట్టుకొని కథ కథనాలు అల్లుకోవడం ఒకెత్తయితే దాన్ని తెరపైకి తెచ్చేందుకు నిర్మాత పెట్టే బడ్జెట్‌ లెక్క మరొకెత్తు. అందుకే పెద్ద హీరోలతో మల్టీస్టారర్‌లు ఎప్పుడూ కలగానే మిగిలిపోతుంటాయి. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణల జమానాలో సినీప్రియులు ఎన్నో అపురూప మల్టీస్టారర్‌లు చూడగలిగారు. తర్వాతి తరంలో వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల హయాంలో ఒక్క అరుదైన మల్టీస్టారర్‌ను చూడలేకపోయింది తెలుగు ప్రేక్షక లోకం.
చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌‌తో కలిసి సినిమా చేయాలని 90ల్లో కొందరు అగ్ర దర్శక నిర్మాతలకు ఆలోచన వచ్చింది. హిందీలో వచ్చిన ‘త్రిదేవ్’(1989) సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఈ ముగ్గురు హీరోలతో దాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. ముగ్గురు హీరోల ఇమేజ్‌లకు సరిపడే స్థాయిలో ఈ సినిమా ఉండటం, మూడు పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉండటంతో సినిమా వర్కౌట్ అవుతుందనుకున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ఓ అగ్ర నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేసింది. అప్పట్లో ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో ప్రచారం కూడా జరిగింది.