తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలకు తెరలేపుతూ వార్తల్లో నిలుస్తుంటారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. నిత్యం ఏదో వివాదం అతడి చుట్టూ తిరుగుతునే ఉంటుంది. ఆయన తీసే సినిమాలే కాదు.. చేసే ట్విట్స్ కూడా ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సంచలనాలు రేపే రామ్ గోపాల్ వర్మ.. మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. వర్మపై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ‘ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? ’అంటూ రాంగోపాల్ వర్మ ట్విట్ చేశాడు. అయితే ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ద్రౌపతి ముర్ము ను కించపరిచే విదంగా వర్మ ట్వీట్ చేశారని బీజేపీ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అబిడ్స్ పోలీసులను కోరారు. మహిళ పట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
If DRAUPADI is the PRESIDENT who are the PANDAVAS ? And more importantly, who are the KAURAVAS?
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2022
ఈ రోజు రాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అధికార బీజేపీ ఎన్డీయే కూటమి నుంచి ఒడిశాకు చెందిన ఆదివాసి బిడ్డ, మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షవ్యక్తమవుతోంది. పలువురు ప్రముఖులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.
ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా జూన్ 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్లు జూన్ 29వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, జులై 21 లోగా ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరి రాంగోపాల్ వర్మ పై చేసిన ఫిర్యాదుపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.