
ఒక వ్యక్తికి పెళ్లి వయసు వచ్చిందంటే చాలు ఇక ఆ కుటుంబంలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. తమ ఇంట్లోని వధువు లేదా వరుడు పెళ్లికి రెడీ అయ్యాడని ఆ కుటుంబ సభ్యులు చేసే హంగామా అంతాఇంతా కాదు. అయితే ఆ పెళ్లి సమయంలో అబ్బాయి లేదా అమ్మాయి ఎలాంటి ఫీలింగ్‌తో ఉన్నారనే విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. నిజానికి పెళ్లితో కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్న ఆ అమ్మాయి, అబ్బాయిల మనసులో అనేక సందేహాలు, అనుమానాలు నెలకొని ఉంటాయి.
వారు పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అనే ప్రశ్న మొదట వారిలో కలుగుతుంది. ముఖ్యంగా అమ్మాయిల్లో పెళ్లి అనగానే అదోరకమైన భయం నెలకొంటుంది. వారు పెళ్లి తరువాత ఎలా తమ జీవితాన్ని కొనసాగిస్తారా అనే ఆందోళన వారిలో కలుగుతుంది. ఇక పెళ్లి తరువాత తమకు రాబోయే భర్తలు ఎలా ఉంటారా, వారు తమ వారితో ఎలా ప్రవర్తి్స్తారా అనే అంశంలో చాలా సందేహాలు నెలకొనడంతో పెళ్లి అంటేనే భయపడుతుంటారు. అయితే ఇలాంటి విషయాలను ఏమాత్రం పట్టించుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
పూర్తి ధైర్యం, విశ్వాసంతో పాటు పాజిటివ్ మైండ్‌తో పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని వారు సూచిస్తున్నారు. పెళ్లి గురించి ఏవైనా భయాలు ఉంటే, తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆయా విషయాలపై చర్చించాలని, తద్వారా అమ్మాయిలు పెళ్లికి రెడీ అయ్యి ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. అయితే పెళ్లి విషయంలో అబ్బాయిలు కాస్త తక్కువ భయపడతారని, అమ్మాయిలు తమ పుట్టినిల్లు వీడి వెళ్లాలనే ఆలోచనతో భయాందోళనకు గురవుతున్నారని పలు సర్వేలు తేల్చాయి. అందుకే అమ్మాయిలు కూడా పెళ్లికి ముందే తమ జీవితానికి సంబంధించి ఏదైనా సందేహం ఉంటే దాన్ని నివృత్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.