
చాలా మంది అందంగా కనిపించేందుకు అందుబాటులో ఉన్న అన్ని రకాల పద్ధతులను పాటిస్తుంటారు. అయితే చర్మ సౌందర్యం విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటుండటంతో వారి చర్మం జిడ్డుగా, నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఈ విషయం తెలుసుకుని వారు వెంటనే బ్యూటీ పార్లర్లు, స్కిన్ సెంటర్ల చుట్టూ ప్రదిక్షణలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే ఉండే కొన్ని పదార్ధాలతో మనం చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు.
మన వంటింట్లో ఉండే బంగాళదుంపతో చర్మాన్ని మెరిసే విధంగా మార్చుకోవచ్చు. ఒక గిన్నెలో చెంచాడు యోగర్ట్, చిటికెడు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మగడ్డి నూనె లేదా సాండల్‌వుడ్ నూనె తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో బంగాళదుంప ముక్కలను ముంచుతూ వాటితో ముఖానికి మిశ్రమం అంటేలాగా రాసుకోవాలి. ఈ విధంగా ముఖానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తరువాత ఓ 15 నిమిషాలపాటు అలాగే వదిలేయాని. ఆ తరువాత నీటితో కడుక్కుంటే నల్లమచ్చలు తగ్గి, చర్మం మెరుస్తుంది. ఇలా రోజూ చేస్తే అతి తక్కువ రోజుల్లో కాంతిమంతమైన చర్మం మీ సొంతం చేసుకోగలరు.
ఇక బియ్యంపిండితో కూడా మీరు మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోగలరు. టీస్పూన్ అలోవెరా జెల్, చెంచాడు బియ్యంపిండి, కొంచెం ఉప్పు, రెండు చుక్కలు లావెండర్ నూనె తీసుకుని పేస్ప్యాక్ మాదిరిగా తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖం మొత్తం మర్ధనా చేసినట్లు అప్లై చేసుకోవాలి. కొద్దిసేపు అలాగే వదిలేసి, అది ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత కాస్త మాయిశ్చరైజర్ రాసుకుంటే మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ఇలాంటి ఇంట్లో లభించే పధార్థాలతో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకుని అందంగా మారండి.