
భార్యాభర్తలు పాలునీళ్లలా కలిసి ఉంటే ఆ దాంపత్యం నిత్యం ఆనందంగా సాగుతుంది. అయితే వారి మధ్య కొన్నిసార్లు ఏర్పడే మనస్పర్ధల కారణంగా ఒక్కోసారి పరిస్థితులు చేయిదాటి వెళ్తుంటాయి. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు ఏర్పడి, అవి చాలా దూరం వరకు వెళ్తుంటాయి. కానీ అలాంటి వాటికి మొదట్లోనే ఫుల్స్టాప్ పెడితే ఆ జంట సంతోషంగా ముందుకు వెళ్తారు. అయితే ఇలా తమ మధ్య జరిగే కొన్ని గొడవలను పరిష్కరించడంలో చాలా మంది తప్పటడుగులు వేస్తుంటారు.
భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా ఎదుటివారు సర్ధుకుపోయే ధోరణిని అవలంభించాలి. ఒకవేళ ఎదుటివారు తప్పుచేశారని గొడవకు దిగితే, ఇది ఇద్దరికీ ఇబ్బందికరంగా మారుతుంది. అయితే కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదని, ఆ విషయాన్ని మరింత లాగకూడదు. కేవలం అభిప్రాయాలే కాకుండా శృంగారం విషయంలోనూ ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఒకరి ఇష్టం, అభిప్రాయం తెలుసుకుని వారికి నచ్చే విధంగా ఎదుటివారు ప్రవర్తించాలి. ఈ విషయంలో భార్య, భర్త ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంటుంది. కాగా తమ మధ్య వచ్చే గ్యాప్‌ను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ఉండాలి.
ఇలా చేయకుండా ఎప్పుడూ తమదే పైచేయి ఉండాలని ఎవరు చూసినా అసలుకే మోసం వస్తుంది. ఇక బిజీ లైఫ్ నుండి బయటకు వచ్చి తమ భాగస్వామితో మనస్ఫూర్తిగా సమయం గడిపితే వారిద్దరి మధ్య ఎలాంటి దూరం ఏర్పడే అవకాశం ఉండదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా మీరు కూడా మీ భాగస్వామితో గడపండి. అది మీ మధ్య ఏదైనా గ్యాప్ ఉంటే దాన్ని పూడ్చి, మీ బంధాన్ని మరింత బలంగా చేయడంలో తప్పక తోడ్పడుతుంది.