
మహిళలు తమకు సంబంధించిన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవడంలో స్పెషలిస్టులు అని చెప్పాలి. ముఖ్యంగా వారి అందాన్ని కాపాడే మేకప్ కిట్ దగ్గర్నుండి వారికి మరింత అందాన్ని ఇచ్చే దుస్తుల వరకు అన్నింటినీ చాలా జాగ్రత్తగా భద్రపరుస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ భద్రపరిచిన వస్తువులు కూడా పాడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బీరువాలో పెట్టే బట్టలు, మరీ ముఖ్యంగా పట్టు చీరలు లాంటివి ఎక్కువ కాలం బీరువాలోనే పెడితే అవి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీకు నచ్చిన పట్టు చీరలను ఏళ్లతరబడి పదిలంగా పెట్టుకోవచ్చు.
మీరు ఒకసారి వాడిన చీరను గాలి తగిలేలా నీడలో ఆరేయాలి. అటుపై చెంగు లోపలివైపు పెట్టి మడతపెట్టి, తెల్లటి కాటన్ లాంటి వస్తువులో పెట్టి బీరువాలో పెట్టాలి. ఇక పట్టుచీరలను కనీసం మూడు నెలలకోసారి బీరువా నుండి బయటకు తీసి నీడలో ఆరేయాలి. అయితే ఈసారి మడతను మార్చి మళ్లీ బీరువాలో దాచుకోవాలి. చీరలను కేవలం డ్రై క్లీనింగ్‌లో మాత్రమే ఉతకాలి. ఏదైనా మరక పడితే వెంటనే రెండు చుక్కల షాంపూ వేసి చల్లనీటితో శుభ్రం చేయాలి. పట్టు చీరలను ఒక్క హ్యాంగర్‌లో ఒక్కటే వేయాలి. ఒకే హ్యాంగర్‌లో ఒకటికి ఎక్కువ చీరలు వేస్తే, రెండో చీరకు సంబంధించిన రంగు, మరకలు పడే అవకాశం ఉంది.
ఇక స్టీల్/ఇనుప హ్యాంగర్లు కాకుండా చెక్క హ్యాండర్లు వాడితే చీరలు త్వరగా పాడవ్వవు. నాప్తలిన్ బాల్స్‌ను చీరల మధ్యలో పెడితే పురుగులు రాకుండా ఉంటాయి. వీలైతే వేపాకులను మూటకట్టి చీరల అడుగున పెట్టాలి. ఇలా చేస్తే చిన్నపురుగులు దరిచేరకుండా ఉంటాయి. ఇలా మహిళలు తమ చీరలపై కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వారు ఎక్కువ కాలం వాటిని వినియోగించే అవకాశం ఉంటుంది.