
కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. పలానా అంటూ తేడా లేకుండా అన్ని రంగాలకు చెందిన ప్రజలు లాక్డౌన్లో ఇంటికే పరిమితం అయ్యారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఇచ్చింది. దీంతో చాలా మంది ఇంటి నుండే తమ ఉద్యోగాన్ని చేస్తూ వస్తున్నారు. అయితే ఈ లాక్డౌన్ కాలంలో ఇంటిలో కూర్చుని ఉండటంతో ప్రజలు తమ శరీరాలకు పెద్దగా పనిచెప్పడం లేదు.
అందుకే చాలా మందికి పొట్టలు బయటకు వచ్చాయి. ఇక కొంతమంది శరీరానికి పనిచెప్పకపోవడంతో వారు చాలా బద్దకంగా మారారు. ఇలాంటి వారి కోసం వర్కవుట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. ఇంట్లోనే ఉంటూ కొన్ని వ్యాయామాలు చేస్తే ఆరోగ్యంగా, రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. మంచంపై కాళ్లు జాపుకొని వెల్లకిలా పడుకోండి. కుడి మోకాలును మీ ఛాతీకి ఆనించే ప్రయత్నం చేసి, 20 సెకన్లపాటు ఉంచాలి. అటుపై మొదటి పొజిషన్‌కు వచ్చేయాలి. అలాగే ఎడమ మోకాలును కూడా ఛాతీకి ఆనించండి. ఇలా నాలుగు సార్లు చేయాలి.
ఇంట్లోని సోఫాపైనా, మంచం మీతో కూర్చుని కూడా వ్యాయామం చేయొచ్చు. కాళ్లు జాపీ పాదాలను తలగడకో, గోడకో ఆనించాలి. అటుపై ముందుకు వంగి చేతితో కాళ్ల బొటనవేళ్లను 20 సెకన్ల పాటు తాకే ప్రయత్నం చేయాలి. అయితే కాళ్లు నిటారుగా పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా అయిదుసార్లు చేయాలని వారు తెలపారు.
నిటారుగా నిల్చుని మీ చేతులను పైకి ఎత్తండి. శరీరాన్ని పూర్తిగా స్ట్రెచ్ చేసి ఊపిరి బాగా పీల్చి, నిధానంగా వంగుతూ కాలి మునివేళ్లను పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇలా 10 సెకన్లపాటు వంగి ఉండాలి. తిరిగి మీ యథాస్థానానికి రావాలి. ఈ విధంగా 5 సార్లు చేస్తే మీ పొట్ట తగ్గడంతో పాటు ఉత్సాహంగా ఉంటారని వ్యాయమ నిపుణులు తెలిపారు.