
నిత్యం ఎన్నో సమస్యలతో సతమతమయ్యే జనం ఓ మంచి టీ లేదా కాఫీని తాగి రిఫ్రెష్ అవ్వాలని చూస్తుంటారు. కాగా కొందరు పని ఒత్తిడి లేదా మానసిక ఉల్లాసం కోసం ఎక్కువసార్లు టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే టీ, కాఫీలు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ ప్రజల్లో నెలకొందని, వాస్తవానికి టీ, కాఫీలు తాగితే ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
టీ, కాఫీ లాంటి పానీయాల్లో కెఫీన్ అనే పధార్ధం ఉంటుందని, అది ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ కారణంగా చాలా మంది వాటిని తాగేందుకు జంకుతున్నారు. అయితే టీ, కాఫీలు తాగే వారిలో నొప్పిని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని అలబామా యూనివర్సిటీలోని సైకోఫార్మకాలజీ ప్రొఫెసర్లు అంటున్నారు. వారు 62 మందిపై అధ్యయనం చేయగా, అందులో రోజుకు రెండు కప్పుల కెఫీన్ తీసుకునే వారు మిగతా వారితో పోలిస్తే నొప్పిని కాస్త ఎక్కువగా తట్టుకుంటున్నారు.
అయితే ఇది కేవలం కెఫీన్ ప్రభావంతోనే కాకుండా వారివారి అలవాట్ల వల్ల కూడా మారుతుందని వారు అంటున్నారు. మద్యం, తంబాకు తీసుకునే వారిలో ఈ నొప్పిని తట్టుకునే శక్తి తక్కువగా ఉందని వారు తేల్చారు. దీనికిగల కారణం మొక్కల నుండి వచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి ఈ శక్తి ఎక్కువగా ఉందని, అందుచేత కెఫీన్ తీసుకోవడంలో ఎలాంటి హాని లేదని వారు తేల్చారు.