
ఆరోగ్యంగా ఉండేందుకు మనం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఏది తింటే ఏం లాభమో తెలుసుకుని మరీ తింటాం. అయితే పండ్ల విషయంలో మనకు తెలియని చాలా ప్రయోజనాలు ఒక్కో పండులో ఉన్నాయనేది వాస్తవం. ఆరోగ్యం కోసం అందరూ యాపిల్ పండును తినాలని అంటుంటారు. కానీ యాపిల్ ఒక్కటే కాకుండా చాలా పండ్లు అందుబాటులో ఉన్నా, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మనకు తెలియకపోవడంతో వాటిని తక్కువగా తింటుంటాం.
ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండే అరటిపండు విషయంలో మనకు తెలియని ప్రయోజనాలు చాలా దాగి ఉన్నాయి. అరటిపండ్లు ఎక్కువగా తీసుకుంటే మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అరటిలో పిండిపదార్థాలు, కార్బోహైడ్రేటులు ఎక్కువ మోతాదులో ఉండటంతో శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అరటి పండి తినడంతో జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. తద్వారా మలబద్ధకం రాకుండా నివారిస్తుందని వైద్యులు అంటున్నారు.
అరటిపండులో 74% కన్నా ఎక్కువగా నీరు ఉండటంతో మన శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచుతోంది. ఇక ఇందులోని పొటాషియం రక్తపోటు ఉన్నవారికి మేలు చేకూరుస్తుంది. ఇది ఎముకలకు, దంతాలకు బాగా ఉపయోగపడుతుంది. ఇక అరటిపండు తింటే అధిక రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, క్యాన్సర్, అజీర్తి జీర్ణ సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. కేవలం అరటిపండు మాత్రమే కాకుండా అరటి కాండం, ఆకులు, పువ్వులు కూడా మనకు మేలు చేస్తాయి. అందుకే రోజుకో అరటిపండు తింటే మన ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుందని వైద్యుల సూచిస్తున్నారు.