వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి సినీ స్టార్స్ క్యూ కడుతున్నారు. మొన్నటికి మొన్న టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్‌బాబు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. నేడు హీరో రాజశేఖర్ దంపతులు కాసేపటి క్రితం వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందుగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాసానికి చేరుకున్న వీరిద్దరూ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జీవిత, రాజశేఖర్ దంపతులకు వైసీపీ కండువా కప్పి వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం హీరో రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను చూసిన జగన్ మోహన్‌రెడ్డి వేరు.. ఇప్పుడు తన కళ్లముందున్న జగన్ మోహన్‌రెడ్డి వేరని, జగన్‌లో ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబుకు సీఎం బాధ్యతలు అప్పగిస్తే ఆయన సూపర్ సీఎం అనిపించుకున్నారని, ఆ తరువాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల మద్దతుతో సీఎం బాధ్యతలు చేపట్టి సూపర్ డూపర్ సీఎం అనిపించుకున్నారన్నారు.
ప్రజల సంక్షేమం, రైతుల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు వైఎస్ఆర్ను అగ్రస్థానంలో నిలబెట్టాయన్నారు రాజశేఖర్. ఇప్పుడు జగన్‌కు కూడా ఒక్క అవకాశం ఇస్తే ప్రజల మనసులో నిలిచిపోయేలా ప్రజారంజక పాలన చేయగలడన్న నమ్మకం తమకుందని, ప్రజల్లో కూడా జగన్‌పై అదే అభిప్రాయముందని అన్నారు. ఏపీలో రాబోయేది జగన్ ప్రభుత్వమేనని రాజశేఖర్ చెప్పారు.