ఇటీవల విజయనగరం వేదికగా జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో పాల్గొన్న వైసీపీ కీలక నేత కోలగట్ల వీరభద్రస్వామి మంత్రి బొత్స సత్యనారాయణ వర్గాన్ని ఉద్దేశిస్తూ ఘాటైన హెచ్చరికలు చేశారు. జిల్లాలో ఎవరైనా తనకు తెలియకుండా పనులు చేయిస్తామని, పథకాలు ఇప్పిస్తామంటూ ప్రజల వద్దకు వెళితే సొంత పార్టీవారినైనా వదిలేది లేదంటూ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కోలగట్ల వీరభద్రస్వామి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా బొత్స సత్యనారాయణ వర్గాన్ని ఉద్దేశించే చేశారన్న చర్చ జరుగుతోంది. కోలగట్ల వ్యాఖ్యల తరువాత విజయనగరం నియోజకవర్గంలో కాక మరింత పెరిగింది. వచ్చే ఎన్నికల తరువాత విజయనగరం కార్పొరేషన్‌గా మారనుండటంతో మేయర్ పదవిని తమ సొంతం చేసుకోవాలని బొత్స వర్గం స్కెచ్ వేస్తోంది. విజయనగరం మేయర్ పదవి తమవారిదైతే కోలగట్ల వర్గానికి కళ్లెం వేయొచ్చని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్టు సమాచారం.
కోలగట్ల వీరభద్రస్వామి సైతం తన కుమార్తెను విజయనగరం కార్పొరేషన్‌కు మొదటి మేయర్‌ను చేయాలని వ్యూహాలను రచిస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య చాపకింద నీరులా కొనసాగుతున్న రాజకీయ వార్ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో బహిర్గతం కావడం గమనార్హం.