ఏపీలో అక్రమ కట్టడాలకు అధికారుల నోటీసుల పర్వం కొనసాగుతోంది. తాజాగా విశాఖ టీడీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాలయం అక్రమ కట్టడమని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి టీడీపీ కార్యాలయ భవనాన్ని నిర్మించారని, తాము అందించిన నోటీసులకు సరైన సమాధానం రాకుంటే కూల్చివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ కార్యాలయంతోపాటు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టిన మరికొందరికి అధికారులు నోటీసులు జారీ చేశారు.
అక్రమ కట్టడాలకు నోటీసులు, భవనాల కూల్చివేతలపై మాటతూటాలు పేల్చుతున్న టీడీపీ నేతలపై మంత్రి మోపిదేవి వెంకట రమణ ఫైరయ్యారు. టీడీపీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. నోటీసుల అందజేత కక్షపూరిత చర్యలు కావని, ఆయన స్పస్టం చేశారు. అక్రమ కట్టడం ఏదైనా సరే కూల్చివేయాలంటూ సీఎం జగన్ ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారన్నారు.