పదవులపైన ఆశతోనో, డబ్బుపైన మమకారంతోనే తాను రాజకీయాల్లోకి రాలేదని బైరెడ్డి సిద్దార్థరెడ్డి అన్నారు. ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నారా చంద్రబాబు టీడీపీలో ఉన్నంతకాలం ఆ పార్టీ వినాశనం దిశగా పయనిస్తూనే ఉంటుందన్నారు.
గౌరు వెంకట్‌రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి చెరొకపార్టీలో ఉండి నాటకాలు ఆడుతున్నారు.. వారు చేసేది మోసమని తాను గతంలో నారా లోకేష్‌ను కలిసి చెప్పిన విషయాన్ని బైరెడ్డి సిద్దార్థరెడ్డి గుర్తు చేశారు. అదే సమయంలో తాను వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయన్నారు. రాజకీయ జీవితం తనను చాలా మార్చిందని, గతంలో తనను కిడ్, గూండా, రౌడీ అన్నవారంతా ఇప్పుడు యువనాయకుడు అంటూ తన వెనుక నడుస్తున్నారన్నారు.
ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న కష్టానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తనకు ఒక వేదిక ఇచ్చారన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో తాను చెప్పినట్టే అన్ని జరగాలంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. తాను గతంలో కరెక్టు నిర్ణయం తీసుకున్నానే కాబట్టే.. కరెక్టు టైమ్‌లో వైసీపీలో చేరానంటూ బైరెడ్డి సిద్దార్థరెడ్డి చెప్పారు.