
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఎవరు చేపడతారా అని అందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తు వస్తున్నారు. కాగా తాత్కాలిక అధ్యక్షురాలిగా తాను రాజీనామా చేస్తున్నట్లు సోనియా తెలపడంతో, నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) దీర్ఘంగా చర్చించింది. ఈ సమావేశంలో సోనియాతో పాటు రాహుల్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. అయితే గంటలకొద్దీ చర్చలు జరిపినా కూడా ఈ కమిటీ ఓ నిర్ణయం తీసుకోలేకపోయింది.
ఇతర సీనియర్ నేతలపై ఉన్న వివాదాలను ఈ సమావేశంలో చర్చించినట్లు, అందుకే తమ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా అయితేనే బాగుంటుందని పలువురు కోరారట. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా పేరును ప్రస్తావించడంతో పలువురు వారి అంగీకారాన్ని తెలిపారు. ఇలా భిన్నాభిప్రాయాల మధ్య సోనియాకే మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు దక్కాయి. ఇక మరోసారి తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను తన భుజాలపై మోయనున్నారు.
కాగా ఈ మాత్రం దానికేనా ఇన్ని గంటలపాటు హడావుడి చేసిందంటూ కమలం నేతలు వ్యంగ్యా్స్త్రాలు విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం అనే పదానికి చోటు లేదు కాబట్టే ఇలా అధ్యక్ష పదవి కోసం లొల్లి పెడుతున్నారని, ఇకనైనా కాంగ్రెస్ నేతలు అంతర్గత విరోధాలు మానుకుని ప్రజల గురించి ఆలోచించాలని పలువురు కామెంట్ చేస్తున్నారు.