పుల్వామా ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉన్నాం అని బారోసా ఇస్తుంది. ఇప్పటికే చాలామంది సైనికుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రేటీస్ వరకు, చివరికి KTR లాంటి రాజకీయ నాయకులు కూడా పార్టీ పరంగా కాకుండా సొంతంగా ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాలకు అండగా నిలబడ్డారు.
ఇలా సైనికులకు దేశం మొత్తం ఇంత బారోసా ఇవ్వడం చూసి మొదటిసారి “SBI బ్యాంక్” ఎవ్వరూ ఊహించని పని చేసి శభాష్ అనిపించుకుంది. అసలు విషయానికి వస్తే.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు చెందిన రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” ప్రకటించింది. పైగా ఇది వెంటనే అమల్లోకి వస్తుందని పూర్తి బారోసా ఇచ్చారు SBI బ్యాంక్ అధికారులు.
మరీ ముఖ్యంగా సైనికులంతా SBI బ్యాంక్ ఖాతాదారులే కావటంతో వారికి డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికి రూ.30 లక్షల బీమా కూడా ఉంది. ఆ మొత్తాన్ని కూడా 1 రూపాయి తగ్గకుండా చెల్లించనున్నట్లు ప్రకటించారు బ్యాంక్ అధికారులు. పైగా ఆ బీమా మొత్తాన్ని సైనికుల వారసులకు ఈ రెండు, మూడు రోజుల్లోనే అందించనున్నట్లు తెలిపిన బ్యాంక్ అధికారులు “దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన మన సైనికులందరికి సాధ్యమైనంత వరకు తోడ్పాటు అందించాలన్నదే మా ముఖ్య ఉద్దేశం” అని అందరి మనసులు గెలుచుకున్నారు.