కేంద్ర మాజీమంత్రి, బీజేపీ జాతీయ మహిళా మోర్చ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తన స్వయాన తమ్ముడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఝలక్ ఇచ్చారు. కాగా, ఇటీవల కాలంలో టీడీపీ నుంచి బీజేపీలోకి చేరికలు ఊపందుకున్న సంగతి తెలిసిందే.
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విదేశీపర్యటనకు ముందు ఈ వ్యవహారం చాపకింద నీరులా కొనసాగగా ఆ తరువాత టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. చంద్రబాబుకు ఎంతో నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్న అంబికా కృష్ణ సైతం బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో మరింత మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతారంటూ రాజకీయ విశ్లేషకులు సైతం వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాదిరిగానే టీడీపీ నుంచి బీజేపీలోకి చేరికలు కొనసాగింపుగా ఎమ్మెల్యే బాలకృష్ణ సమీప బంధువు, టీడీపీ కీలక నేతగా వ్యవహరించిన పొట్లూరి కృష్ణబాబు పార్టీకి గుడ్‌బై చెప్పారు. పురందేశ్వరి సమక్షంలో పొట్లూరి కృష్ణబాబు ఆయన సతీమణి బీజేపీలో చేరారు. పురందేశ్వరి వారికి బీజేపీ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.