గోదావరి నీరు సముద్రంలో కలవకుండా, ఆ నీటిని రాయలసీమతోపాటు ఏపీలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్న జిల్లాలకు మళ్లించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఆ మేరకు అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశారని నీటిపారుదలశాఖ మంత్రి అనీల్‌కుమార్ యాదవ్ అన్నారు.
కాగా, తాజాగా మీడియాతో మాట్లాడిన అనీల్ కుమార్ యాదవ్ ఇటీవల వైఎస్ జగన్ – కేసీఆర్‌ల భేటీ గురించి ప్రస్తావించారు. గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారన్నారు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రుల సహాయ సహకారాలతో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకెళతున్నాయన్నారు.
అయితే, జగన్ – కేసీఆర్ భేటీపై ఏపీ ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడానని అనీల్ కుమార్ ఖండించారు. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ఏపీ ప్రజల్లో సీఎంగా జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భయంతోనే ఏపీ ప్రతిపక్షం టీడీపీ నాయకులు ఆరోపణలు, విమర్శలు చేస్తుందని మండిపడ్డారు.
అదే సమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై కూడా అనీల్ కుమార్ యాదవ్ సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఏ రోజు కూడా జనాల మధ్య అడుగుపెట్టని వ్యక్తి కూడా ట్వీటర్ వేదికగా జగన్‌ను విమర్శిస్తున్నారని, చిలకపలుకులు పలుకుతున్నారని ఎద్దేవ చేశారు.
అసలు టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు నాయకుడిని వెతుక్కునే పనిలో ఉన్నారని, వారి నెక్ట్స్ లీడర్ ఎవరో వారికే తెలియని కంగారులో టీడీపీ శ్రేణులు ఉన్నారని మంత్రి అనీల్ కుమార్ అన్నారు. చంద్రబాబు ఔట్‌డేటెడ్ అయిపోయాడని, లోకేష్ పులికేసి అవతారమెత్తాడని, నెక్ట్స్ తమ గతేంది..? అని భావిస్తున్న కొందరు టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని, మరికొందరు మరొకపార్టీ అంటూ క్యూకడుతున్నారన్నారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో మంత్రి అనీల్ కుమార్‌యాదవ్ మీడియా సమావేశం వీడియోను వీక్షించిన కొందరు నెటిజన్లు టీడీపీకి భవిష్యత్తు టాలీవుడ్ నటరుద్రుడు జూ.ఎన్టీఆర్ అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.