తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి పాలనను ప్రజలకు మరింత దగ్గరచేయడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతికి గౌరవం దక్కేలా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రమారావు కృషి చేశారని ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. ఆ తరువాత ప్రజలకు ఏమేమి అవసరమో వాటినే సంక్షేమ పథకాలుగా ప్రవేశపెట్టి ప్రజల మనసులో చిరస్థాయిలో నిలిచిన వ్యక్తిగా వైఎస్ఆర్ నిలిచారని ఆయన అన్నారు.
అలా ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరు చేసిన పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేయగలడన్న నమ్మకం ఏపీ ప్రజల్లో ఉందని, ఆ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చలసాని శ్రీనివాసరావు అన్నారు. కాగా, ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాసరావు ఈ విషయాలను చెప్పారు.
అంతేకాకుండా, వైఎస్ జగన్‌ను ఏపీ ప్రజలు ఎందుకు సీఎం కావాలని కోరుకుంటున్నారో అన్న ప్రశ్నకు చలసాని శ్రీనివాసరావు ప్రధానంగా నాలుగు కారణాలను చెప్పారు.
1. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాడుతున్న నాయకుడు ఒక్క జగన్ మాత్రమేనని, రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు జగన్ ప్రత్యేక హోదాపై ఏ నాడు కూడా మాట తప్పలేదన్నారు. జగన్‌ను ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించినా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పడం జగన్‌పై ప్రజల్లో మరింత అభిమానాన్ని పెంచిందన్నారు.
2. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ ఏపీ వ్యాప్తంగా చేసిన పాదయాత్ర చరిత్రలో మిగిలిపోతుందన్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నేత కూడా 3,600 కిలోమీటర్లు నడిచింది లేదని, జగన్ తన పాదయాత్ర ఆద్యంతం ప్రజలతో మమేకమై వారి సమస్యలను సామరస్యంగా తెలుసుకుని, వారికి తానున్నానన్న భరోసా ఇవ్వడంతోప్రజల్లో నమ్మకం కలిగింనద్నారు.
3. వైఎస్ జగన్‌పై కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ఏనాడూ తలొగ్గకుండా పోరాడిన వైనం అమోఘమన్నారు. జగన్‌పై పెట్టిన కేసులన్నీ అక్రమమైనవేనని ప్రజలకు కూడా తెలిసిపోయిందని, దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత జగన్‌కు అనుకూలంగా మారుతుందని చలసాని శ్రీనివాస్ తెలిపారు.
4. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడిగా ప్రజా జీవితంలోకి రావడం జగన్‌కు కలిసి వచ్చే అంశమని, ఆయన అమలు చేసిన పథకాలను అమలు చేయడంతోపాటు, వాటికి మరికొన్నిటిని జోడించి మరింత సంక్షేమం దిశగా ప్రజలను తీసుకెళతానన్న మాటలు ప్రజల్లోకి మరింతగా చొచ్చుకెళ్లాయని, వైసీపీ ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ శ్రేణులు విజయవంతమయ్యారని, ఈ నాలుగు అంశాలు ఏపీ ప్రజలు జగన్‌ను సీఎం చేసేందుకు దోహదపడతాయని చలసాని శ్రీనివాస్ తెలిపారు.