
భారతదేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అనారోగ్యం కారణంగా కొద్ది క్షణాల ముందు తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా బారిన పడిన ప్రణబ్, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు ఢిల్లీలోని ఆర్మీ ఆర్ అండ్ అర్ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రణబ్ ముఖర్జీ మరణించినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు.
84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యం కారణంగా ఆగస్టు 10న ఆసుపత్రిలో చేరగా, ఆయనకు మెదడుకు సంబంధించిన సర్జరీ చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కాగా అప్పటి నుండి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. గతవారం రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వచ్చింని, అయితే ఊపిరితిత్తుల సమస్య కారణాంగా నేడు సాయంత్రం ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రణబ్ ముఖర్జీ 2012 నుండి 2017 వరకు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. భారతరత్న అవార్డు అందుకున్న ప్రణబ్ ముఖర్జీ అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా నేతల్లో ఆయనపట్ల ప్రత్యేకమైన గౌరవం ఉంది. కాగా ప్రనబ్ ముఖర్జీ మృతిపట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరియు పలువురు రాజకీయ నేతలు తమ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.