మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. గత ప్రభుత్వం ఈ హత్య కేసు విచారణ కోసం సిట్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే సిట్ బృందంపై తమకు నమ్మకం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె చెప్పడంతో జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం 23 మంది పోలీసులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో నలుగురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు కూడా ఉన్నారు. కొద్ది రోజుల నుంచే కేసు దర్యాప్తు చేస్తున్న ఈ ప్రత్యేక బృందం దర్యాప్తును వేగవంతం చేసింది.
కేసు విచారణలో భాగంగా ఇప్పటికే జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల పరిధిలోని పలువురు కీలక నేతలు పార్టీలతో సంబంధం లేకుండా టీడీపీ, వైసీపీ నేతలకు సంబంధించిన కాల్ డేటాను సేకరించింది. ఇప్పుడు ఆ డేటా ఆధారంగా నేతలను విచారించేందుకు హత్య కేసును చేదించేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే పులివెందుల చేరకున్న ఈ ప్రత్యేక బృందాలు పలువురు కీలక నేతలకు ఫోన్లుచేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది.
ఇలా ఫోన్‌కాల్ అందుకున్న వారిలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పులివెందులలో గతంలో జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసిన సతీష్‌కుమార్‌రెడ్డికి కూడా పోలీసులు ఫోన్లు చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డికి డీఎస్పీ ఫోన్‌చేసి కేసు విషయమై పులివెందుల పోలీసు స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదేశించారు.