వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపట్ల అఘాయిత్యాలు పెరిగిపోయాయని, మహిళలను వివస్త్రలను చేసి అత్యంత ఘోరంగా చంపేస్తున్నారన్నారు. ఇంతటి దారుణ పరిస్థితుల్లో ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందేమోనన్న భయంతో ప్రజావేదికను కూల్చి వారి దృష్టిని మరల్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు.
హైదరాబాద్‌లో ఉన్న నీ నివాసం లోటస్‌పాండ్‌లో ఎలా కట్టావు..? ఏ చెరువులో కట్టారో గుర్తుందా..? ఇస్కాన్ టెంపుల్ ఎలా కట్టావు..? అంటూ సీఎం జగన్‌పై మాజీ మంత్రి జవహర్ ప్రశ్నల వర్షం కురిపించారు. అక్రమ కట్టడాలను కూలుస్తానని చెబుతున్న నీవు బీజేపీ నేతలకు సంబంధించిన ఆస్తులను ఎప్పుడు తొలగిస్తావు..? నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అంటూ మీడియా ద్వారా జగన్‌ను ప్రశ్నించారు. అలా తన మన బేధాలు చూపకుండా అక్రమాలను కూల్చిన నాడే నీవు నిజమైన నాయకుడవు అవుతావని సీఎం జగన్‌ను ఉద్దేశించి జవహర్ అన్నారు.