మరో పది రోజుల్లో తాను బీజేపీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమన్నారు. తాను పదవుల కోసం ఆరాటపడటం లేదని, తనను ఎన్నుకున్న ప్రజల కోసం, వారి ఆశలను నెరవేర్చేందుకే బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవని, ఇప్పుడు తనకు పదవులు ఇచ్చినా కాంగ్రెస్‌లో కొనసాగే ప్రసక్తే లేదన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు చేజారిపోయారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలంటే బీజేపీలో చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోవాలన్నా.. టీఆర్ఎస్ను గద్దెదించాలన్నా ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని, తాను ఆ దిశగా ప్రయాణం చేయాలనుకుంటున్నానన్నారు. తాను బీజేపీలో చేరిక విషయమై రామ్‌మాధవ్‌ను కూడా కలవడం జరిగిందని, ఆయన తన చేరికకు ఆహ్వానం పలికారన్నారు.