ప్రజావేదిక కూల్చివేతపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. చంద్రబాబు ఇంటిని ఆనుకుని కృష్ణా కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని అధికారులు కూల్చేస్తుంటే మరోవైపు కూల్చివేతలను తక్షణం ఆపాలంటూ హైకోర్టులో పిల్‌ను కూడా దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పీ.శ్రీనివాసరావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటలు దాటిన తరువాత కూడా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట వాదనలు కొనసాగాయి.
అయితే, ప్రజా వేదిక అక్రమ నిర్మాణమే అంటూ శ్రీనివాసరావు తన పిటిషన్లోనే పేర్కొన్నారు. ఈ భవనం అక్రమమా..? కాదా..? అని కోర్టు ప్రశ్నించగా పిటిషన్ అవుననే సమాధానం ఇచ్చారు. అలాంటప్పుడు ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని న్యాయస్థానం ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో పూర్తిగా ఏకీభవించిన హై కోర్టు పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, ప్రకృతి వనరులను భవిష్యత్ తరాలకు అందించడం రాజ్యాంగం బాధ్యత అని కోర్టు ప్రస్తావించింది. పర్యావరణానికి విఘాతం కలిగించేలా వ్యవహరించిన నిర్మాణ దారుల నుంచి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని కోర్టు అభిప్రాయపడింది. అక్రమ నిర్మాణం చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి, మాజీ మత్రి నారాయణ నుంచి రికవరీ చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకీభవించింది.